Tuesday, December 25, 2007

భారతదేశము, ఐకమత్యము

భిన్నత్వంలో ఏకత్వం; ఏకత్వంలో భిన్నత్వం:

భారతదేశము ఒక విభిన్నమైనటువంటి దేశం, ఎందుకంటే, ఇదియొక భిన్న జాతుల, సంస్కృతుల కలయిక. ఒకరకంగా మనం ఆంగ్లేయులకి ఋణపడిఉన్నాము ఈ విషయములో. వివిధ ప్రాంతాలవారి ఆచారాలు వేరు, కట్టుబాట్లు వేరు, అభిరుచులు వేరు, ముఖ్యంగా భాషలు వేరు. ఈ కూటమి ఐకమత్యం ఎంత బలమైనది? కాల పరీక్షలకి తట్టుకుని ఎంతవరకు నిలబడగలదు?

భిన్నత్వంలో భిన్న తత్వం:

భారతీయుల్ని ఎన్ని రకాలుగ విభజించవచ్చు?

పెద్దగ కష్టపడక్కరలేకుండా, రెండు భాగాలుగ విడగొట్టొచ్చు; ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు. ఇందులో మళ్ళీ, మహారాష్ట్రులు ఉత్తరాదివారా లేక దక్షిణాదివారా అనేది వివాదాస్పదం. అందువల్ల, ఉత్తరాదివారిని, మహారాష్ట్రులని ప్రక్కన పెడితే, మిగిలిన దక్షిణాదివారు ఎంత సారూప్యత కలిగి ఉన్నారు? నాలుగు రాష్ట్రాలవారు నాలుగు రకాలుగ ఉంటారు, నాలుగు వేరు వేరు భాషలు మాట్లాడతారు. నీళ్ళ దగ్గిర్నుండి అన్నింటికి దెబ్బలాటలే. దక్షిణ భారతాన్ని స్థూలంగా నాలుగు భాగాలుగ ( నాలుగు రాష్ట్రాలుగ ) విభజించవచ్చు. మిగిలిన మూడు రాష్ట్రాల్ని ప్రక్కన పెడితే, మిగిలినది మన రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ లేక విశాలాంధ్ర. మరి దీన్ని ముఖ్యంగా మూడు భాగాలుగ విడకొట్టొచ్చు; కోస్తా, తెలంగాణా, మరియు రాయలసీమ. ఇందులో మళ్ళీ, కోస్తాని తీసుకుంటే, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా. ఇలా విభజించుకుంటూ పోతే, మన ఊరిదాకా వచ్చేస్తాము :) ఇకపోతే, మాట్లాడే భాష ఆధారంగా విడిపోతూంటాము. ఆపైన మతముల ఆధారంగా, తర్వాత కులాల ప్రాతిపదికపై, మళ్ళీ అందులొ తరగతులపై ...

మరీ అంత ప్రస్పుటంగా కనపడకపోయినా, పట్టణవాసులు, పల్లెవాసులు అని, ఇంకా అనేక రకాలుగ. మరిచాను, ధనవంతులు, బీదలు, ఇది పైన చెప్పుకున్న అన్ని వర్గాలలోనూ కనపడుతుంది.

చరిత్ర చాలా ముఖ్యమైనది. చరిత్ర పునరావృతమౌతోందని అంటూంటారు, అంటే ఇంతకు మునుపు చరిత్రలో జరిగినవే మళ్ళీ జరగడమన్నమాట. ఐతే మనం చరిత్రనుంచి ఏమైనా నేర్చుకుంటున్నమా? ఎప్పుడెప్పుడు పెద్ద రాజ్యాలు ముక్కలై చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి? చక్రవర్తి బలహీనపడినప్పుడు, సామంతరాజులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని విడిపోయేవారు. అంటే ప్రధాన రాజ్యం బలంగా ఉండటం చాలా ముఖ్యమన్నమాట కదా.

మరి ఇప్పుడు, చిన్న చిన్న పుట్టగొడుగు రాజకీయ పక్షాలు ఏ ప్రాంతానికాప్రాంతం లో వెలసి కొండొకచొ బలపడి కేంద్రాన్ని బలహీన పరుస్తున్నాయి. ఇది అంత మంచి పరిణామం కాదు. మన దేశం లాంటి వాటికి ద్విపక్ష రాజకీయాలే మంచిది. ఇన్ని రాజకీయ పక్షాలు అవసరమా? అందరి ఉద్దేశ్యము ప్రజల సంక్షేమమే
అయినప్పుడు ఇన్ని పక్షాలు ఎందుకు?

సంకీర్ణ ప్రభుత్వాలు, ఇవే ప్రస్తుత కాలంలో ఉండేవని, ఉండబోతాయని, దానికి తగ్గట్టుగా రాజకీయ పక్షాలు మారిపోవాలని కొంతమంది సలహ. మనకి సంకీర్ణాలు ఎందు వచ్చాయి?, వాటి అవసరమేమిటి? ప్రజలను పరిపాలించడానికి ఒక భాద్యతగల అధికార పక్షము, మరింత భాద్యతాయుతమైన విపక్షము సరిపోవా?

ద్విపక్ష రాజకీయాల వల్ల అస్థిరత తగ్గుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. అవే పక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఉంటాయి కాబట్టి కేంద్రం బలోపేతమవడాని ఆస్కారముంటుంది (కొద్దిగ బలహీనమైన వాదనే అయినప్పటికి).

ఇకపోతే, పరిపాలన ఎలా ఉండాలి, ఇందులో కూడా చరిత్రనుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది. అశోకుడు, చెట్లు నాటించెను, చెరువులు త్రవ్వించెను, సత్రములు కట్టించెను అని చిన్నప్పటినుండి చదువుకుంటూనే ఉంటాము. అలాగే సింధు లోయ నాగరికతలో కూడ, పట్టణ పారిశుధ్యం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు కాని, మన ప్రస్తుత పరిపాలకులకి, ఏంచెయ్యాలో తెలీదు. ప్రభుత్వమనేది ప్రజలకి నివసించడానికి, అభివృద్ధి చెందడానికి కావలసిన లేక అనువైన వాతావరణాన్ని కల్పించాలి, అంతే. అంతకు మించి ఏమీ చెయ్యనక్కరలేదు. ప్రజల భద్రత కూడ ఇందులోకే వస్తుంది.

భవదీయుడు
సూర్యుడు :-)

No comments: